చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఓ రోజు ముందే రానున్న అమిత్ షా.. అందుకేనా?

Amit shah AP Tour: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చకా చకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జూన్ 12న ఉదయం 11:27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే ఈ వేడుక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర పెద్దలు, బీజేపీ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషయానికి వస్తే.. ఆయన ఒకరోజు ముందుగానే ఏపీకి రానున్నారు. మంగళవారం సాయంత్రమే అమిత్ షా.. విజయవాడకు బయల్దేరనున్నారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో.. అమిత్ షా, చంద్రబాబు భేటీ జరగనుంది. ఇక రాత్రి 11:20కి విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకోనున్న అమిత్ షా అక్కడే బస చేయనున్నట్లు సమాచారం.

అయితే ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే ఉండవల్లికి రానున్న అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ కానున్నారు. ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనా, తాజా పరిణామాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మలకు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. అయితే లోక్ సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఎంపిక విషయం కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 14 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టులో 12 హెలీ ప్యా్డ్‌లను సైతం సిద్ధం చేశారు. అలాగే విమానాశ్రయం పరిసరాల్లోనూ ఆంక్షలు విధించారు. విమాన ప్రయాణికులను కూడా ఉదయమే ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-11T11:29:09Z dg43tfdfdgfd