ODISHA NEW CM | మరికాసేపట్లో ఒడిశా కొత్త సీఎం ఎంపిక.. భువనేశ్వర్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు

Odisha new CM : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సాయంత్రం జరిగే ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మరో కేంద్రమంత్రి భూపిందర్‌ యాదవ్‌ ఇప్పటికే భువనేశ్వర్‌కు చేరుకున్నారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో ఒడిశా బీజేపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు.

ఒడిశాలో గత ఐదు పర్యాయాలుగా విజయం సాధిస్తూ వచ్చిన అధికార బీజేడీ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. దాంతో నవీన్ పట్నాయక్‌ 25 ఏళ్ల ఏకధాటి పాలనకు బ్రేక్‌ పడింది. ఈసారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఘన విజయం సాధించింది. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అధికార బీజేడీ 51 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను ఇతరులు దక్కించుకున్నారు.

అయితే ఒడిశాలో బీజేపీ విజయం సాధించడంతో సీఎం పదవి ఎవరికి కట్టబెట్టాలనేదానిపై బీజేపీ హైకమాండ్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సాయంత్రం ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆదేశించి, ఆ సమావేశానికి రాజ్‌నాథ్‌ సింగ్‌, భూపిందర్‌ యాదవ్‌లను కేంద్ర పరిశీలకులుగా పంపింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటే వారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

2024-06-11T09:18:51Z dg43tfdfdgfd