ఇరాన్ తరహా విషాదం.. మలావీ విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి

ఇరాన్ దుర్ఘటన తరహాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీలో విమానం కుప్పకూలిన ఘటనలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. సోమవారం (జూన్ 10) అదృశ్యమైన విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు అధికారులు నేడు గుర్తించారు. ఈ ఘటనలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమాతో పాటు మరో 9 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా వెల్లడించారు. ఈ విమానం కోసం మాలవీ భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. కానీ, చివరికి విషాద వార్తే వినాల్సి వచ్చింది. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో మిగిలిలేరని మలావీ అధ్యక్షుడు తెలిపారు.

గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులతో ముమ్మరంగా గాలించారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి ఆపరేషన్ నిర్వహించారు. పొరుగు దేశాల సాయం తీసుకొని హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని తీసుకున్నారు. అమెరికా, బ్రిటన్‌, నార్వే, ఇజ్రాయెల్‌ దేశాలు కూడా తమకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయని మలావీ ప్రభుత్వం తెలిపింది.

మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమాతో పాటు మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్‌ 10న అదృశ్యమైంది. మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి ఆ విమానం బయలుదేరింది. 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా జుజులో దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ నుంచి సూచనలు అందాయి. ఆ తర్వాత కాసేపటికే రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జుజు సమీపంలోని పర్వత ప్రాంతంలో విమానం కుప్పకూలిపోయినట్లు తాజాగా వెలుగులోకి రావడంతో మలావీ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.

ఇరాన్ హెలికాప్టర్ ప్రమాదం

మే 19న ఇరాన్‌లోనూ ఇదే తరహా దుర్ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్, మరో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ వార్త ఇరాన్‌లో తీవ్ర విషాదం నింపింది. రైసీ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-11T14:11:46Z dg43tfdfdgfd