GOLKONDA BONALU | ఆషాఢ బోనాల ఏర్పాట్లు ఇంకెప్పుడు?.. గోల్కొండ కోటలో ఇప్పటికీ ప్రారంభం కాని పనులు

హైదరాబాద్‌: ఆషాఢ మాసం అనగానే చారిత్రాత్మక గోల్కొండ బోనాలు (Golkonda Bonalu) గుర్తుకొస్తాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించిన తర్వాతే హైదరాబాద్‌లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. అయితే ఆషాఢం సమీపిస్తున్నప్పటికీ బోనాల ఏర్పాట్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పదేండ్లుగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాలు ఈ సారి ఎలా జరుగుతాయో? అని ప్రజలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంతంతగా జరిగే బోనాల పండుగను అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చేలా నిర్వహించారు.

ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం నుంచి ప్రారంభమై తొమ్మిది వారాల పాటు జరిగి, ఇక్కడే పూర్తి అవుతాయి. ప్రతి ఆది, గురువారాల్లో జరిగే పూజలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ర్టాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనాల రూపంలో మొక్కులు సమర్పించుకుంటారు. ఈ సారి ఆషాఢ మాసం బోనాలు జూలై 7న ప్రారంభం కానుండగా, ఇప్పటి వరకు గోల్కొండ కోటలో ఏర్పాట్లు ప్రారంభం కాలేదు. గత ఏడాది జూన్‌ 22న బోనాలు ప్రారంభమయ్యాయి. కానీ, ప్రభుత్వం 40 రోజుల ముందు నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. ఆలయానికి రంగులు మొదలు బోనాల ఊరేగింపు వరకు ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ చేయాల్సి ఉండగా, ఆషాఢ మాసం బోనాల ఊసే లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయని, ప్రభుత్వం బోనాల కోసం వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ సలహాదారు, సంఘ సేవకులు సిరుగుమల్లె రాజు వస్తాద్‌ డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం బోనాలకు నెల రోజుల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించేదని, ఈ సారి ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇప్పటికీ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అసలు ఆషాఢ మాసం బోనాల ఊసే ఎత్తక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే స్పందించి గోల్కొండ బోనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.

2024-06-11T04:10:35Z dg43tfdfdgfd