MANHOLES | మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. జలమండలి హెచ్చరిక

సిటీబ్యూరో, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్‌లోని(GHMC) రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోల్స్‌ (Manholes) తెరిస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి (Jalmandali MD) హెచ్చరించారు. వర్షాకాల నేపథ్యంలో జలమండలికి సమాచారం లేకుండా ఎవ్వరూ మ్యాన్‌హోల్‌ తెరవొద్దని సూచించారు.

ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు, అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచిన, తొలగించిన జలమండలి యాక్ట్‌-1989 సెక్షన్‌ 74 ప్రకారం నేరమని, దీనిని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులతో పాటు నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని ఎండీ చెప్పారు.వర్షాకాల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని ఎండీ వెల్లడించారు.

లోతైన మ్యాన్‌హోళ్లతో పాటు 25వేలకు పైగా మ్యాన్‌హోళ్లపై ఇప్పటికే సేఫ్టీగ్రిల్స్‌ బిగించామని, ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్‌ చేసి రెడ్‌ పెయింట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్‌ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందజేశామని ఎండీ వివరించారు.

2024-06-11T12:46:08Z dg43tfdfdgfd