TELANGANA | ఎందరినో దాటి తెలంగాణ మేటి.. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో దేశానికే తలమానికంగా రాష్ట్రం

  • తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణకు సరిలేరెవ్వరు!
  • జీఎస్డీపీలో టాప్‌.. పదేండ్లలో 190 శాతం వృద్ధిరేటు
  • 13 పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డులు నమోదు
  • రాబడి లోనూ రారాజే.. 12% దాటిన వార్షిక పన్ను ఆదాయ వృద్ధి
  • జాతీయ సగటుతో పోల్చితే అనేక అంశాల్లో రాష్ట్రం ముందంజ
  • రుణాల కట్టడిలో అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ
  • పదేండ్ల ఆర్థిక ప్రగతికి అద్దంపట్టిన సామాజిక ఆర్థిక సర్వే-2024
  • అయినా అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం
  • సంపద వృద్ధిని ప్రస్తావించకుండా పదే పదే రుణాల ప్రస్తావన
  • వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు విఫలయత్నం

2014లో తెలంగాణ ఎట్లున్నది? ఆర్థిక స్థితిలో ఎక్కడున్నది? పదేండ్లలో ఎట్ల కొత్త శిఖరాలకు చేరింది? ఎంత సంపద పెరిగింది? తెలంగాణ దశాబ్ది ప్రగతికి ఆర్థిక సర్వేలు ప్రశంసలు కురిపిస్తుంటే.. కాంగ్రెస్‌ మాత్రం అప్పుల దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధిని దాచి.. అప్పులను బూచిగా చూపుతూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నది.

సంపద పెరిగింది వాస్తవం

రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.3,47,299గా, జీఎస్డీపీని రూ.14.63 లక్షల కోట్లుగా బడ్జెట్‌లో భట్టి ప్రస్తావించారు. కానీ, 2014లో 1,12,162గా ఉన్న తలసరి ఆదాయం 3 రెట్లు ఎలా పెరిగిందో చెప్పలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5.78 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ రెండున్నర రెట్లకుపైగా ఎలా వృద్ధి సాధించిందో వివరించలేదు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.లక్ష కోట్ల నుంచి మూడు రెట్లకు పెరిగి.. రూ.2.91 లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిందో ప్రజలకు వెల్లడించలేదు. ఎందుకంటే.. ఈ సంపద వృద్ధికి కారణం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కాబట్టి!

అప్పులపై తప్పుడు ప్రచారం

పదేండ్లలో తెలంగాణ అప్పు రూ.75,577 కోట్ల నుంచి రూ..6.71లక్షల కోట్లకు పెరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదు.

– బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి

Telangana | (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్‌, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. 2014లో పుట్టుకతోనే పుట్టెడు సమస్యలు నెత్తినెత్తుకొన్న తెలంగాణ.. అన్ని రంగాల్లో అధ్వాన స్థితిలో ఉన్న తెలంగాణ.. 2024 నాటికి చేరిన శిఖరాలను గమనిస్తే.. పదేండ్ల కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో బూడిద నుంచి పుట్టి నిప్పులు కక్కుతూ ఆకాశానికి ఎగిరిన ఫీనిక్స్‌ పక్షిని తలపించక మానదు. ఈ విషయాలను తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే -2024 స్పష్టం చేసింది. కానీ ఈ వాస్తవాలను దాచిపెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పదే పదే అప్పుల గురించి ప్రచారం చేస్తూ.. రాష్ట్ర సంపద ఎలా పెరిగింది? రాష్ట్రంలో వ్యవసాయం, రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పన ఎలా జరిగింది? అన్నది మాత్రం చెప్పలేదు.

2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించిననాడు.. తెలంగాణ నడి చౌరస్తాలో ఉన్నది. పేరుకే మిగులు బడ్జెట్‌ అయినా.. అంతకు మించి నెత్తిమీద రూ.77,577 కోట్ల అప్పుతో రాష్ట్రం ఆవిర్భవించింది. కునారిల్లిన వ్యవసాయ రంగం, పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు, గంటలకు గంటలు కరెంటు కోతలు, సాగు, తాగునీటికి కటకట.. ఇలా ఏ రంగం చూసినా నాడు తెలంగాణ చీకటిలో నిలబడిన పరిస్థితి. ఒక రాష్ర్టానికి బడ్జెట్‌ దిక్సూచి వంటిది.

రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించి, వాటికి బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలి. కానీ తెలంగాణ ఏర్పడే నాటికి బడ్జెట్‌ పద్దుల తయారీ కూడా అగమ్యగోచరంగా ఉండేది. అన్ని రంగాలు కుప్పకూలిన స్థితిలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని దుస్థితి. ఆర్థిక వనరులు ఏ మేరకు ఉంటాయో తేలని స్థితి. ఇలాంటి పరిస్థితిలో నాటి సీఎం కేసీఆర్‌ వివిధ రంగాల మేధావులతో చర్చోపచర్చలు జరిపారు. ప్రధాన రంగాలు గాడిన పడాలంటే బండికి ఇరుసు మాదిరిగా విద్యుత్తు రంగం కీలకమని గుర్తించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సగానికిపైగా జనాభాకు జీవనాధారంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు తేవాలని నిర్ణయించారు.

పెట్టుబడులు తరలివస్తేనే రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని తేల్చారు. మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే? అప్పటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.లక్ష కోట్లు మాత్రమే. ఇందులో అత్యధిక శాతం నిర్వహణకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్‌ వివిధ మార్గాల ద్వారా రుణాలను సేకరించి.. మౌలిక సదుపాయాలను కల్పించారు. ఫలితంగా పదేండ్లలోనే తెలంగాణ దేశానికే తలమానికంగా ఎదిగింది. అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలతో సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌గా నిలిచింది. కటిక చీకట్లలో నలిగిన తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా అవుతున్నా.. ఐటీ, ఫార్మారంగాలకు దేశానికే దిక్సూచిగా నిలిచినా.. ప్రపంచ రికార్డులు సృష్టించే సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ గడ్డమీద నిర్మాణం అయినా.. ఇవన్నీ కేసీఆర్‌ పాలనతోనే సాధ్యం అయ్యాయన్నది సుస్పష్టం.

తల‘సిరి’ సవ్వడులు

పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను దేశం లేదా రాష్ర్టాభివృద్ధికి కొలమానంగా తీసుకొంటారు. కేసీఆర్‌ హయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్‌ వేగంతో దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104గా నమోదైంది. 2023-24నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299కు ఎగబాకింది. ఈ వ్యవధిలో దేశ తలసరి రూ.86,647 నుంచి రూ.1,83,236కు చేరుకొన్నది. అంటే పదేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం.. దేశ తలసరి ఆదాయం కంటే 89.53 శాతం ఎక్కువగా నమోదైంది. అంతేకాదు.. దేశ తలసరి ఆదాయం కంటే, రాష్ట్రంలోని 30 జిల్లాల తలసరి ఆదాయం చాలా ఎక్కువ. దేశంలోనే పెద్ద రాష్ర్టాలుగా చెప్పుకొనే గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక తదితర 13 పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే, తెలంగాణ తలసరి ఆదాయవృద్ధి రేటు ఎంతో ఎక్కువగా నమోదైంది. పదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో 180 శాతం మేర పెరుగుదల నమోదవగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో 82 శాతం మాత్రమే వృద్ధి నమోదవడం గమనార్హం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ నమోదైన తలసరి వృద్ధిరేటు తెలంగాణ కంటే తక్కువే.

జీఎస్డీపీలో అగ్రస్థానం

2014-15లో ప్రస్తుత ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే, 2023-24 నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. పదేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ రూ.9.59 లక్షల కోట్ల మేర పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. వృద్ధిరేటులో 13 పెద్ద రాష్ర్టాలను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. కరోనా ప్రభావం ఉన్న 2019-20, 2020-21లోనూ తెలంగాణ వృద్ధిరేటు దేశాన్ని అధిగమించింది. పదేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిరేటు 190 శాతంగా రికార్డయింది. తెలంగాణ నమోదుచేసిన వృద్ధిరేటులో మూడోవంతు వృద్ధిరేటును కూడా బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ తదితర రాష్ర్టాలు నమోదు చేయకపోవటం గమనార్హం.

రుణాల కట్టడిలో ఆదర్శం

ఏ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా అప్పులు చేయడం పరిపాటి. అగ్రరాజ్యాలుగా చెప్పుకొనే అమెరికా, బ్రిటన్‌ కూడా రుణగ్రస్థ దేశాలే. కేంద్రం నుంచి సాయం అందకపోయినా, కొత్త రాష్ట్రమైనప్పటికీ రుణాలను పరిమితంగానే తీసుకొన్నది తెలంగాణ. జీఎస్డీపీతో పోలిస్తే అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఉండటమే దీనికి నిదర్శనం. పెద్ద రాష్ర్టాల సూచీలో జీఎస్డీలో అప్పుల పరంగా తెలంగాణ కింది నుంచి ఐదో స్థానంలో ఉండగా, జీఎస్డీపీలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ర్టాలుగా పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, బీహార్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కానీ, కేంద్రం అప్పులు జీడీపీలో 62 శాతానికిపైగా ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. కేంద్రంతో పోల్చిచూసినా.. తెలంగాణ చేసిన అప్పులు నియంత్రణలోనే ఉన్నాయని దీన్నిబట్టి అర్థమవుతున్నది.

రాబడిలోనూ రారాజే

పదేండ్ల కేసీఆర్‌ హయాంలో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకున్నా.. స్వశక్తితో తెలంగాణ నిధులను సమకూర్చుకొన్నది. 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధిరేటు 12 శాతం కంటే ఎక్కువగానే నమోదైంది. ఇది దేశంలోని ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే అత్యధికం. అతి తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డు సృష్టించింది. పదేండ్లలో బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయరంగంలో మౌలిక వసతుల కల్పన, 24 గంటల తాగునీరు, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసిన రాష్ట్రంగానూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించింది. పరిశ్రమల స్థాపన, ఐటీ ఎగుమతులు, ఉద్యోగకల్పన.. ఇలా దాదాపు డజను రంగాల్లో తెలంగాణ మిగతా రాష్ర్టాల కంటే గొప్ప పురోగతి సాధించింది.

 

   

తెలంగాణ చిన్న రాష్ట్రమైనా.. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని కేసీఆర్‌ పదే పదే చెప్తుంటారు. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుత ధరల వద్ద పరిశీలిస్తే..

 

2024-07-26T23:49:47Z dg43tfdfdgfd