YS JAGAN | రేవంత్‌తో బాబుకున్న లింక్‌ ఏమిటి? ఏపీలో హింసపై కాంగ్రెస్‌ ఎందుకు స్పందించదు?: వైఎస్‌ జగన్‌

YS Jagan | హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు.. కాంగ్రెస్‌ పెద్దలతో ఎలా టచ్‌లో ఉన్నాడో కూడా కాంగ్రెస్‌ పార్టీనే అడగాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ ధర్నాకు పలువురు ప్రతిపక్షపార్టీలకు చెందిన జాతీయ నేతలు హాజరయ్యారు.

ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ మినహా.. మిగతా పెద్ద పార్టీలు జగన్‌కు మద్దతు పలకడంతో వైసీపీ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయా? అనే కొత్త చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన జగన్‌.. తమ ధర్నాకు కాంగ్రెస్‌ నేతలు ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడగాలని అన్నారు. మణిపూర్‌ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎందుకు స్పందించదు? అని నిలదీశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట..

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని జగన్‌ విమర్శించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఆర్డీవో ఆఫీసులో డాక్యుమెంట్లు కాలిపోతే అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీసులో, కలెక్టర్‌ ఆఫీసుల్లో ఉంటాయని తెలిపారు. అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా చేసి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారని మండిపడ్డారు. వైసీపీ లక్ష్యంగానే పల్నాడులో పోలీసు అధికారులను మార్చారని అన్నారు. న్యాయం, ధర్మం వైపు పోలీసులు నిలబడటం లేదని విమర్శించారు. రెడ్‌బుక్‌ను చూపిస్తూ నారా లోకేశ్‌ బెదిరింపులకు దిగారని అన్నారు.

రెడ్‌బుక్‌ పేరుతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడానికి కారణం రెడ్‌బుక్‌ అని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను దాచి అసత్య ప్రచారంతో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్లు అప్పుచేశారని ఆరోపించిన టీడీపీ , గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులని వినిపించారని దుయ్యబట్టారు. వాస్తవానికి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు రూ. 5.18 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేరొన్నారు.

2024-07-26T23:19:37Z dg43tfdfdgfd