ఆ ఉపాధ్యాయుడు చేసిన పనికి.. అందరూ హ్యాట్సాప్ అంటున్నారు.. ఎందుకంటే..

గత వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. ఈ పరిస్థితులలో మారుమూల గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎత్తుకొని సురక్షితంగా ఒర్రెను దాటించి భేష్ అనిపించుకున్నారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి.

పంట చేలు నీట మునిగాయి. కాగా జిల్లాలోని పెంచికల్ పేట మండలం జైహింద్ పూర్ గ్రామ సమీపంలోని చెరువు నిండి మత్తడి దూకడంతో అదే పంచాయతీ పరిధిలోని కొండపల్లి పెద్ద ఒర్రె లోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. అయితే ఈ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో పెద్ద ఒర్రెకు అవతలి వైపు నుండి ప్రతి రోజు పాఠశాలకు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. కాగా పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు ఇంటికి బయలు దేరిన సమయంలో వదర నీటి ఒర్రెలోకి భారీ నీరి వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు ఒంటరిగా ఒర్రె దాటే పరిస్థితి లేకపోవడంతో అదే పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్ విద్యార్థులను ఎత్తుకొని వారిని సురక్షితం ఒర్రె దాటించి ఆవలి వైపుకు దింపారు.

ఉపాధ్యాయుడు చూపిన ధైర్యానికి గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని అభినందనలతో ముంచెత్తారు.ఆ పాఠశాలలో గొడుగులు పట్టుకొని కూర్చున్న విద్యార్థులు :సాధారణంగా వర్షంలో ఎక్కడికైన బయటకు బయలుదేరిన సమయంలో గొడుగు పట్టుకొని వెళ్లడం చూస్తాం. కానీ ఆ పాఠశాలలో మాత్రం విద్యార్థులు గొడుగులు పట్టుకొని తరగతి గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఈ పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉంది.

కానీ మూడే తరగతి గదులు ఉన్నాయి. అందులో రెండు తరగతి గదుల్లో పైకప్పుకు పగుళ్లు తేలాయి. అవి వర్షానికి ఊరుస్తున్నాయి. ప్రస్తుత వర్షలకు గోడలు పగుళ్లు తేలి, పై కప్పు కూడా పగిలి ఊరుస్తుండటంతో వర్షం నీరు తరగతి గదుల్లోకి వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు తాము, తమ పుస్తకాలు తడవకుండా గొడుగులు పట్టుకొని తరగతి గదిలో కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధిందిన ఫోటోలు, వీడీయోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాఠశాలను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. బాధ్యతారాహిత్యం వ్యవహరించారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. వర్షాలు తగ్గాక పాఠశాలకు మరమ్మత్తులు చేపడతామన్నారు.

2024-07-27T06:33:31Z dg43tfdfdgfd