ఆరంభానికి ముందు ఉగ్ర కుట్ర?

  • ఫ్రాన్స్‌ హైస్పీడ్‌ రైల్వే నెట్‌వర్క్‌పై ఆకస్మిక దాడి

విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థపై ఆకస్మిక దాడి జరగడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. సొసైటీ నేషనల్‌ డెస్‌ కెమిన్స్‌ డి ఫర్‌ ఫ్రాంకైస్‌ (ఎస్‌ఎన్‌సీఎఫ్‌) హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌లోని లిల్లె, బొర్డియాక్స్‌, స్ట్రాస్‌బోర్గ్‌, పారిస్‌-మర్‌సెల్లి ప్రాంతాలలో గుర్తుతెలియని దుండగులు సిగ్నల్‌ బాక్సులను ధ్వంసం చేయడమే గాక పలు చోట్ల రైల్వే లైన్లకు నిప్పంటించి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఈ రూట్లలో తిరిగే హై స్పీడ్‌ రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే నెట్‌వర్క్‌ సేవలు స్తంభించిపోవడంతో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటి రూట్లను మార్చడంతో సుమారు 8 లక్షల మంది ప్రయాణీకులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. తాజా ఘటనతో ఒలింపిక్స్‌ భద్రత కోసం సుమారు 45 వేల మందితో పహారా కాస్తున్న ఫ్రాన్స్‌కు మున్ముందు మరిన్ని ఉగ్ర ముప్పులు పొంచి ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.

2024-07-26T22:59:53Z dg43tfdfdgfd