ఉంటుందా.. పోతుందా?

  • తిరుమలాయపాలెం ఆసుపత్రి ఉంటుందా.. పోతుందా? స్థాయి తగ్గిస్తారంటూ పుకార్లు షికార్లు
  • వంద పడకల ఆసుపత్రిపై కొనసాగుతున్న సందిగ్ధత
  • స్పష్టత ఇవ్వని స్థానిక మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు
  • ఉద్యమబాట పట్టిన అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజలు
  • ఆసుపత్రి ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

తిరుమలాయపాలెం, జూలై 26 : తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలాయపాలెం 100 పడకల ఆసుపత్రిని తరలించడానికి వీలులేదంటూ ఈ ప్రాంత అఖిలపక్ష పార్టీలు పోరుబాట పట్టాయి. మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత నాలుగురోజులుగా ఆసుపత్రి ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంతా జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, పౌరసంబంధాలశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఎవ్వరు కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చుట్టుపక్కల మండలాలకు కేంద్రంగా ఉండడంతోపాటు పాత తాలుకాగా ఉన్న తిరుమలాయపాలెంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. గత ముఖ్యమంతి కేసీఆర్‌ పాలనలో తిరుమలాయపాలెం పీహెచ్‌సీ స్థాయిని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేసి రూ.4.50 కోట్ల వ్యయంతో నూతన ఆసుపత్రి భవనాన్ని సైతం నిర్మించారు.

ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్‌ కళాశాల మంజూరుకావడంతో తిరుమలాయపాలెం సీహెచ్‌సీని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రికి అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనుల్లో పురోగతి జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పొంగులేటి చొరవతో తిరుమలాయపాలెం ఆసుపత్రికి ఖమ్మం నుంచి డిప్యూటేషన్‌పై 12 మంది డాక్టర్లు, 23 మంది స్టాఫ్‌నర్సులు, సిబ్బందిని నియమించారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన మంత్రి పొంగులేటి ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. దీంతో ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుందని సంబరపడుతున్న తరుణంలో ఆసుపత్రి స్థాయిని తగ్గిస్తారని వదంతులు రావడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన డాక్టర్ల బదిలీల్లో తిరుమలాయపాలెం ఆసుపత్రి పేరు జాబితాలో లేకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు ముగ్గురు ఇతర ప్రాంతాలకు బదిలీ కోరుకొని వెళ్లారు. దీంతో ఆసుపత్రిని తరలిస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. ఈ విషయమై జిల్లా మంత్రులు లేదా అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం మంజూరు చేసిన వంద పడకల ఆసుపత్రిని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత కోరుతూ ఈ నెల 29వ తేదీన తిరుమలాయపాలెంలో అఖిలపక్ష పార్టీలు భారీ ధర్నాకు పిలుపునిచ్చాయి.

2024-07-26T22:49:39Z dg43tfdfdgfd