CM CONVOY | కాన్వాయ్‌ వచ్చే.. పోలీసులు బెంబేలెత్తే

CM Convoy | సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): అనుకున్న సమయం కంటే అరగంట ముందు శుక్రవారం మధ్యాహ్నం సీఎం కాన్వాయ్‌ సచివాలయం వైపు రావడంతో అటు సామాన్యులు.. ఇటు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. అలాగే సీఎం కాన్వాయ్‌ ఆ ట్రాఫిక్‌ను ఛేదించుకుంటూ వెళ్లడం మరో ఎత్తు. హైదరాబాద్‌ పోలీసులు సమన్వయ లోపంతో పనిచేస్తున్నారనేదానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. జుబ్లీహిల్స్‌ వైపు నుంచి సచివాలయం వైపునకు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం వస్తున్నాడంటూ అప్పటికే సెట్‌లో పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ముఖ్యమంత్రి అరగంట ముందే సచివాలయానికి బయలుదేరారు. ఆయా కూడళ్లలోకి సీఎం కాన్వాయ్‌ రావడంతో కంగుతిన్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అయితే సీఎం వచ్చే రూట్‌లో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు మధ్యాహ్నం వేళల్లో నిద్రావస్థలో ఉండటంతో ట్రాఫిక్‌ను సముదాయించలేక ఇబ్బందులు పడ్డారనే విమర్శలు వస్తున్నాయి.

సాధారణ ట్రాఫిక్‌ను పక్కకు పంపిస్తూ, సీఎం కాన్వాయ్‌ని మరో పక్కగా వెళ్లనిస్తూ అప్పటికప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. అటూ సీఎం సెక్యూరిటీ విభాగం, ఇటూ శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయం చేసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

2024-07-26T19:49:05Z dg43tfdfdgfd