గుంతలమయంగా ఎన్‌హెచ్‌-363

  • బయటపడిన నాణ్యతా లోపాలు
  • నిర్మించిన ఆరునెలలకే ప్రమాదకరంగా రహదారి
  • వాహనదారులకు ఇబ్బందులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమే నాణ్యతాలోపానికి కారణమని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

ప్రయాణికుల ఇబ్బందులపై ఎట్టకేలకు స్పందించిన హైవే అధికారులు గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. రెబ్బెన మండలం రేపల్లె వాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు దాదాపు రూ. 1200 కోట్లతో 54 కిలోమీటర్ల వరకు నిర్మించిన నాలుగు వ రుసల జాతీయ రహదారి దాదాపు 6 నెలల క్రితమే పూర్తయింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు. కానీ ఆరునెలల్లోనే గుంతలు పడడంతో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

నిర్మించిన ఆరు నెలలకే గుంతలు..

రహదారి నిర్మాణ సమయంలోనే నాణ్యమైన మెటీరియల్‌కు బదులుగా నాసిరకం మెటీరియల్‌ వినియోగించి రహదారి నిర్మిస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోకుండా స్థానికంగా దొరికే మొరం, మట్టి, కంకర నాసిరకమైన మెటీరియల్‌ వినియోగించి రహదారి నిర్మించారు. నిర్మాణం పూర్తయిన ఆరు నెలలకే ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది.

వర్షాలతో గుంతల్లో నీరు చేరడంతో రాత్రి వేళ్లలో హైవేపై వాహనదారులు ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేసిన అధికారుల కారణంగానే రహదారిపై గుంతలు పడుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులపై ఎట్టకేలకు స్పందించిన హైవే అధికారులు ప్రస్తుతం గుంతలు పూడ్చే పనులు చేపట్టారు.

2024-07-26T21:19:17Z dg43tfdfdgfd