దొంగతనానికి వచ్చి పకోడీలు చేసుకొని తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సాధారణంగా దొంగలు ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారు. నిమిషాల వ్యవధిలోనే దొంగతనం పూర్తిచేసి పరార్ అవుతుంటారు. అయితే యూపీలోని నోయిడాలో ఓ దొంగల ముఠా చాలా వెరైటీగా, విచిత్రంగా దొంగతనాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల జరిగిన ఆరు వరుస దొంగతనాల తీరును పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అపార్ట్‌‌మెంట్‌లో ఎవరూ లేని ఫ్లాట్లే వారి టార్గెట్. వీరు చోరీకి వెళ్లిన ఇంట్లో ముందు విలువైన వస్తువులను పరిశీలిస్తారు. తర్వాత వంట గదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండుకొని తింటారు. సోఫాల్లో, బెడ్‌రూమ్‌లో కూర్చొని కబుర్లు చెబుకుంటూ బీడీలు కాలుస్తారు, పాన్ నములుతారు. ఆ తరువాత విలువైన వస్తువులను సంచుల్లో వేసుకుని చెక్కేస్తున్నారు.

దొంగతనానికి వచ్చిన దొంగలు ఫ్రిజ్‌లో ఉండే ఫుడ్‌ను తిని, అవసరమైతే బెడ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాగే సెక్టార్ 25లో ఉండే ఓ వ్యక్తి ఇంటిలో రూ.3 లక్షల విలువైన ఆభరణాలను కాజేశారు. దొంగతనం జరిగిన మరో ఇంట్లో దొంగలు బీడీలు కాల్చి, పాన్ నమిలి బాత్రూంలో ఉమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు.

సెక్టార్ 82లోని ఒక ఫ్లాట్‌లోకి చొరబడిన ఈ దొంగల ముఠా రూ.40 లక్షల డబ్బు, నగలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా వంటగదిలో పకోడీలు చేసుకుని తిన్నారు. తర్వాత విలువైన వస్తువులతో పరార్ అయ్యారు.

* ఆరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడి

ఈ దొంగల ముఠా ఒకే రోజు ఆరు ఇళ్లలో ఇదే తరహా దోపిడికి పాల్పపడ్డారు. ఒక ఇంట్లో పకోడీలు వండుకోవడం, మరో ఇంట్లో ఫ్రిజ్‌లో పుడ్ తినడం, ఇంకో ఇంట్లో పాన్ నమిలి స్నానాల గదిలో ఉమ్మివేయడం చేశారు. బాగా విశ్రాంతి తీసుకున్న తరువాత విలువైన వస్తువులతో ఉడాయించారు. రోజురోజుకూ దొంగతనాలు పెరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లోనే తలుపులు వేసుకుని అనేక జాగ్రత్తలు తీసుకుని, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

* టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

తరచుగా ఇదే తరహాలో దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకోవడానికి డీఎస్పీ హృదేష్ కతేరియా నేతృత్వంలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.

* సినిమా చూసి ప్రేరణ పొందారా?

విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం మహారాజా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ఒక దొంగ ఇంటిని దోచుకునే ముందు రుచికరమైన భోజనం తయారుచేసుకుని తింటాడు. నోయిడాలో జరిగిన ఆరు దొంగతనాలను పరిశీలిస్తే అక్కడి దొంగల ముఠా మహారాజా సినిమా చూసి ప్రేరణ పొంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

2024-07-27T02:47:55Z dg43tfdfdgfd