పుల్‌ ఫీవర్‌…

  • ఖమ్మంలో 74,960 మందికి వైరల్‌ ఫీవర్‌
  • జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు
  • అనధికారిక లెక్కలు మరింతగా ఉండే ప్రమాదం
  • కిక్కిరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లోపించిన పారిశుధ్యం
  • శానిటేషన్‌ లేకపోవడమే కారణమంటున్న వైద్యులు
  • ఉమ్మడి జిల్లాలో విజృంభించిన జ్వరాలు

ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూలై 26 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్‌ ఫీవర్‌ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజూ వర్షం కురుస్తూనే ఉన్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మురుగు గుంతలు కన్పిస్తున్నాయి. వీధుల్లో, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో దోమలు విపరీతంగా పెరిగాయి. తద్వారా ప్రజలను రకరకాల జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అందించిన గణాంకాల ప్రకారం 74,960 మంది వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు.

వారిలో 10,275 మందికి డెంగీ పరీక్షలు చేయగా 243 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతున్న వారి వివరాలన్నీ సేకరిస్తే జ్వర పీడితుల సంఖ్య లక్షల్లో ఉంటుందని వైద్య వర్గాలే అంచనా వేస్తుండడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీల వద్ద ట్రీట్‌మెంట్‌ పొందుతున్న వారు ఇంకెంత మంది ఉంటారనేది లెక్కిస్తే బాధితులు మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వీరిలో నూటికి తొంభై శాతం మంది జ్వర పీడితులే కావడం గమనార్హం. జ్వరపీడితుల తాకిడి కారణంగా తమకు భోజనం చేసే సమయం కూడా ఉండడం లేదంటూ ప్రైవేటు వైద్యులు చెబుతున్న మాటలు జ్వరాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

పారిశుధ్యం అస్తవ్యస్తం..

02

ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు, మరో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. పంచాయతీలకు ఎప్పుడో గడువు తీరిపోవడం, ఇప్పటికీ పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేక అధికారులకు తలకుమించిన భారం కావడం వంటి కారణాలతో పారిశుధ్యం గురించి పట్టించుకున్న పాపానపోలేదు. బ్లీచింగ్‌, క్లోరినేషన్‌, ఫాగింగ్‌ వంటి వాటి జాడేలేదు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ఈ పారిశుధ్య లోపాలు కూడా తోడు కావడంతో ఊరూరా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలుగు చూసిన డెంగీ, వైరల్‌ ఫీవర్‌ కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. మరికొన్ని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో నెలల వయసున్న చిన్నారులు కూడా జ్వర పీడితులుగా నమోదవుతుండడమే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ప్రభుత్వ సేవలు అరకొరే..

వర్షాకాలం సీజన్‌ను, తద్వారా వచ్చే జ్వరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచనా వేయాలి. జిల్లా వైద్యారోగ్యశాఖతోపాటు మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఐసీడీఎస్‌ వంటి కీలక శాఖలను రంగంలోకి దింపి సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేయాలి. గత కేసీఆర్‌ సర్కార్‌ ముందుగానే ఇంటింటి జ్వర సర్వేను జరిపించేది. వారానికి రెండు దఫాలు డ్రైడేలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించింది. పీహెచ్‌సీల వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది సాయంతో బాధితులకు ఇంటి వద్దే వైద్యసాయం అందించేది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. దానితోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కొన్ని రకాల మందులు లేకపోవడం, ప్రభుత్వ సేవలు అరకొరగానే ఉండడం వంటి కారణాలతో జ్వరాల విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికైనా సర్కారు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో జ్వరాల తీవ్రత పెరిగే ప్రమాదముందని వైద్య నిఫుణులు స్పష్టం చేస్తున్నారు.

భద్రాద్రి’లో రోగుల బారులు

భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోగులు, జ్వర పీడితులు బారులు తీరుతున్నారు. జిల్లా ప్రధానాసుపత్రితోపాటు రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 29 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, ఐదు పీపీ యూనిట్లు, మరో ఐదు ఏరియా వైద్యశాలల్లో ఇటీవల జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ కొన్ని రకాల మందులనే ఇస్తున్న వైద్యులు.. మిగతా వాటిని బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తుండడం గమనార్హం.

2024-07-26T21:04:17Z dg43tfdfdgfd