మెరుగైన విద్యను అందించాలి

  • భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌
  • అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ

ఆళ్ళపల్లి, జూలై 26 : ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ పరిసరాలను సందర్శించారు. విద్యార్థులతో భోజనం సరిగా పెట్టడం లేదని తెలుసుకున్న ఆయన వారితో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం వడ్డించడం లేదని, వెంటనే హెచ్‌ఎం బావ్‌సింగ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీని ఆదేశించారు.

కమిషనర్‌ సూచన మేరకు రాత్రిపూట ముగ్గురు టీచర్లు ఉండి సబ్జెక్టులవారీగా చదివించాలని, ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. వర్షాలతో సీజనల్‌ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఒకవేళ అస్వస్థతకు గురైతే వెంటనే పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని సూచించారు. తాజా కూరగాయలతో భోజనం వడ్డించాలని, విద్యుత్‌, తాగునీటి సమస్యలు ఉండొద్దన్నారు. విద్యార్థుల పట్ల అలసత్వం వహించే హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో క్రీడల అధికారి గోపాల్‌రావు, క్రీడా పాఠశాల హెచ్‌ఎం శారద, పాఠశాల సిబ్బంది, కోచ్‌లు మారప్ప, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

2024-07-26T22:49:35Z dg43tfdfdgfd