వరద వదలదే…

  • భద్రాచలం వద్ద రాత్రి 9.15 నిమిషాలకు మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ
  • ముంపు మండలాల ప్రజలకు తప్పని తిప్పలు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 26 (నమస్తే తెలంగాణ) : గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నా.. మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోసారి కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతానికి 47 అడుగులు దాటి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా.. శుక్రవారం ఉదయం నుంచి వరద తగ్గుముఖం పట్టింది. మళ్లీ మధ్యాహ్నం నుంచి అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. రాత్రి 9.15నిమిషాలకు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

ఎగువన వర్షాలతోనే..

ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరిలో మళ్లీ వరద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలో కూడా అక్కడక్కడా చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. తాలిపేరు వద్ద కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు పేరూరు వద్ద వరద నీరు భారీగానే చేరుతోంది. దీంతో శనివారం మళ్లీ గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

2024-07-26T21:04:14Z dg43tfdfdgfd