విజృంభిస్తున్న విషజ్వరాలు

  • కిటకిటలాడుతున్న ప్రభుత్వ దవాఖాన
  • పల్లెలో అపరిశుభ్ర వాతావరణం
  • ప్రబలుతున్న వ్యాధులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇక్కడ 30 మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

జిల్లాలో 63 మలేరియా, టైఫాయిడ్‌ ప్రభావిత గ్రామాలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 డయేరియా, 36 టైఫాయిడ్‌, 8 మలేరియా, 2 డెంగీ కేసులను అధికారులు గుర్తించారు. వర్షాకాలం నేపథ్యంలో మందుస్తు చర్యలు తీసుకోకపోవడం, పారిశుధ్య కార్యక్రమాలు సరిగా నిర్వహించకపోవడంతో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యే గ్రామాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

పారిశుధ్య పనులతో పాటు కలుషిత నీరు తాగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకూ సిద్ధమవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వైద్య సహాయం అందించేందుకు వీలులేని 91 గ్రామాలను అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడం, వాగులపై వంతెనలు లేకపోవడంతో ఆ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు.

2024-07-26T20:19:11Z dg43tfdfdgfd