‘సింగరేణి’లో దవాఖానలు ప్రారంభించండి

  • ఈఎస్‌ఐ డీజికి సింగరేణి సీఎండీ బలరాం విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ కమల్‌కిశోర్‌ సోనును సింగరేణి సీఎండీ బలరాం కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఈఎస్‌ఐ డీజీని కలిసి విజ్ఞప్తి చేశారు.

సింగరేణి వ్యాప్తంగా 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కంపెనీ తరఫున వైద్య సేవలు అందిస్తున్నామని, వారి కుటుంబసభ్యులకు కూడా సేవలు అందించాలని విజ్ఞప్తులు వస్తున్నందున తొలుత కొత్తగూడెం, సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌లో ఈఎస్‌ఐ దవాఖానలు ప్రారంభించాలని కోరారు. ఇందుకు సింగరేణి తరఫున మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈఎస్‌ఐ డీజీ మాట్లాడుతూ.. తొలుత ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరం మేరకు దవాఖానలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

2024-07-27T01:04:54Z dg43tfdfdgfd