హాస్టళ్లను ఎత్తివేసే యోచనలో సర్కారు

మద్దూరు(ధూళిమిట్ట), జూలై 26: నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల(హాస్టళ్లు)ను విద్యార్థులు లేరనే సాకుతో ఎత్తివేసే యోచనలో రాష్ట్ర ప్ర భుత్వం ఉన్నట్లు సమాచారం. కొన్ని ద శాబ్దాల నుంచి సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు, లద్నూర్‌లో ఎస్సీ హాస్టల్‌, ధూళిమిట్టలో ఎస్సీ హాస్టల్‌ ఉండేవి. కాలక్రమంలో విద్యార్థులు లేరని లద్నూర్‌ ఎస్సీ హాస్టల్‌, మద్దూరు బీసీ హాస్టల్‌ను మూసివేశారు. అరకొర విద్యార్థులతో నడుస్తున్న మద్దూరు, ధూళిమిట్ట ఎస్సీ హాస్టళ్లు సైతం రెండేండ్లుగా మూతపడ్డాయి.

మూతపడిన ఈ రెండు హాస్టళ్లను ప్రభు త్వం ఈ ఏడాది తిరిగి తెరిచింది. అయితే హాస్టళ్లలో చేరేందుకు ఆయా గ్రామాల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఒక్కో హాస్టల్‌లో 100 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉన్నా ఒక్క విద్యార్థి కూడా హాస్టల్‌లో చేరేందుకు ముం దుకు రావడం లేదు. హాస్టల్‌లో విద్యార్థులను చేర్చుకునేందుకు అధికారులు కూడా అంతంతమాత్రంగానే ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఈ రెండు హాస్టళ్లను సైతం మూసివేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికితోడు ఇటీవల చేపట్టిన బదిలీల్లో రెండు హాస్టళ్లకు వార్డెన్లు కూడా రావడానికి ఆసక్తి కనబర్చడం లేదు. ప్రస్తుతం ఈ రెండు హాస్టళ్లలో వార్డెన్‌ పోస్టు లు ఖాళీ ఉన్నాయి.

హాస్టళ్లను కాపాడాలి

మద్దూరు, ధూళిమిట్ట, మండలకేంద్రాల్లోని ఎస్సీ హాస్టళ్లను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చొరవచూపాలని పలువురు కోరుతున్నారు. దీనికితోడు హాస్టళ్లలో ప్రవేశాల కోసం అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండు హాస్టళ్లను కాపాడుకుంటే ఈ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగనున్నది. ఇప్పటికే రెండు హాస్టళ్లు మూతపడగా మరో రెండు హాస్టళ్లు మూతపడే ప్రమాదం ఉంది.

2024-07-26T21:19:18Z dg43tfdfdgfd