రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక నుంచి మీ డబ్బులు భారీగా ఆదా.. మంత్రి కీలక ప్రకటన

New Ration Cards Telangana: తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి లాంటి పథకాల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు లాంటి హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఆసరా పెన్షన్లు, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, మహిళలకు 2000 రూపాయల గౌరవ భృతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా.. లాంటి చాలా హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. మరో గుడ్ న్యూస్ వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం హామీని.. కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో.. సామాన్యులకు భారీ ఊరట లభించటమే కాకుండా.. పెద్ద ఎత్తున డబ్బు ఆదా కానుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు మండిపోతున్నాయి. మార్కెట్‌లో మేలురకం సన్నబియ్యం 6 వేల నుంచి 8 వేల వరకు పలుకుతుండటంతో.. సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసే వారు బియ్యం కొనేందుకే తమ జీతంలో పెద్దమొత్తం ఖర్చవుతుండటంతో.. బతకటం కష్టంగా మారిందంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వమే రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్నబియ్యం ఇస్తామనటంతో.. భారీ ఊరట లభించినట్టయింది.

హూజూర్‌నగర్‌ పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించిన నేపథ్యంలో మాట్లాడిన ఉత్తమ్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 2,164 సింగిల్ బెడ్ రూం ఇండ్లను గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సింగిల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో మంజూరు చేసిన పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, క్వాలిటీతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గంలో 7 రోడ్ల నిర్మాణానికి రూ. 156 కోట్లు మంజూరు చేశామని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో 35 రహదారుల నిర్మాణానికి రూ. 267 కోట్లు మంజూరు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకరటించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-11T10:44:31Z dg43tfdfdgfd