TEACHER TRANSFER | వెబ్‌ ఆప్షన్స్‌లో పాఠశాల పేరు మాయం.. టీచర్లు లేక పాఠాలు బోధించుకుంటున్న విద్యార్థులు

  • పాఠశాల ఎదుట గ్రామస్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Teacher Transfer | లింగాల, జూలై 26 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా.. ఇటీవల చేపట్టిన బదిలీల్లో హెచ్‌ఎం అంజిలాల్‌తోపాటు నలుగురు ఎస్జీటీలు వేరే చోటకు వెళ్లారు. విద్యాశాఖ అధికారులు వెబ్‌ఆప్షన్స్‌లో కోమటికుంట పాఠశాల పేరును చూపించకపోవడంతో ఆ స్థానాలు భర్తీ కాలేదు.

టీచర్లు లేకపోవడంతో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటివారికి పాఠాలను బోధించాల్సిన దుస్థితి ఏర్పడింది. హెచ్‌ఎం అంజిలాల్‌ వటవర్లపల్లికి బదిలీ కాగా.. డీఈవో ఆదేశాల మేరకు కోమటికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక గదిలో ఒకటి నుంచి 3 తరగతుల వరకు, మరో గదిలో 4 నుంచి 7 తరగతుల వరకు పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయుడు నరేశ్‌ నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా.. అతడిని కోమటికుంటలో కొన్ని రోజులు విధులు నిర్వర్తించాలని డీఈవో ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఎప్పుడు బదిలీపై వెళ్తారో తెలియడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో చంద్రుడును వివరణ కోరగా.. త్వరలోనే ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు.

2024-07-26T23:15:56Z dg43tfdfdgfd