UNIVERSITIES | గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ సర్కారు.. త్రిశంకుస్వర్గంలో యూనివర్సిటీలు

  • అతీగతిలేని వీసీల నియామకం
  • అధ్యాపక పోస్టుల భర్తీపై అంతే..
  • బడ్జెట్‌లో అరకొర నిధులే సరి
  • కుంటుపడిన విద్యాభివృద్ధి

Universities | హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీలు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. వర్సిటీలలో అభివృద్ధి కుంటుపడగా, అకడమిక్‌ సమస్యలు అటకెక్కాయి. ఫలితంగా వర్సిటీలలో పాలన పడకేసింది. దీంతో ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అధ్యాపకులు, అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. యూనివర్సిటీలలో వైస్‌ చాన్స్‌లర్ల నియామకం కోసం సెర్చ్‌ కమిటీలను ఏర్పా టు చేస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల్లో తాత్కాలికంగా ఐఏఎస్‌లను ఇన్‌చార్జులుగా నియమించారు. 15 రోజుల్లో వీసీల నియామకం పూర్తి చేస్తామని, వర్సిటీలను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఆనాడే మాటిచ్చారు. తీరా ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా, ఇంతవరకు వీసీల నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్‌చార్జి వీసీల పాలన సరికాదని పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

1,500 అధ్యాపక పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సుమా రు 1,500 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. నెలనెలా ఉద్యోగ విరమణల వల్ల ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ దశలో ఖాళీల భర్తీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని వివిధ సంఘాలు పేర్కొంటున్నా యి. ఈ ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలు, పెన్షన్లకు సరిపోయే నిధులనే ప్రభుత్వం కేటాయించింది.

వర్సిటీల అభివృద్ధి, విద్యాభివృద్ధి, పరిశోధనలు, మౌలిక సదుపాయాలు వంటి వాటి కోసం ప్రతిపాదనే లేదు. అన్ని యూనివర్సిటీలకు కలిపి కనీసం రూ.1,000 కోట్లను కూడా కేటాయించలేదని ప్రొఫెసర్లు, విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం వచ్చినప్పటికీ నుంచి యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలు నిత్యకృత్యమయ్యా యి. ఏదో ఒక సమస్యతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీల అభివృద్ధి, విద్యా వికాసానికి తగు చర్యలు తీసుకోవాలని సీనియర్‌ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘా ల నేతలు సూచిస్తున్నారు.

2024-07-27T00:46:11Z dg43tfdfdgfd