నత్తల విందు కోసం 2 లక్షలమంది పోటెత్తుతారు, ఇంకా అక్కడ ఏం దొరుకుతుందంటే...

ప్రతి వసంతకాలం( స్ప్రింగ్ సీజన్)లో రెండు లక్షలమందికిపైగా సందర్శకులు ఆవురావురుమంటూ స్పానిష్ నగరం లైడాకు వస్తారు.

వరల్డ్ ఫేమస్ ఫుడ్ ఫెస్టివల్ ‘లా అప్లెక్ డెల్ కారాగోల్‌’ జరుగుతుంది. అక్కడ ప్రధానంగా వడ్డించేది నత్తలతో చేసిన వంటకాలు.

మీరు నత్తల కూరలను చూడకముందే వాటి వాసనను ఆఘ్రాణిస్తారు. అక్కడి మాంసం వండే పొయ్యిలు పొగలు కక్కుతుంటాయి.

బార్సిలోనాకు పశ్చిమాన 130 కిలోమీటర్ల దూరంలోని వాయువ్య స్పెయిన్‌లోని లైడాలో ‘లా అప్లెక్ డెల్ కారాగోల్‌’ పేరుతో ఏటా ఈ పండుగ జరుగుతుంది.

మీరు ఆ ప్రాంతాన్ని సమీపిస్తున్న కొద్దీ 119 బృందాలు వాయించే సంగీతపు హోరు వినిపిస్తుంటుంది.

పార్టీ టెంట్లలో బార్, కట్టెల పొయ్యి, భోజనం బల్ల ఉంటాయి. ఇక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూర్చుని నత్తల విందు చేసుకుంటారు.

ఈ విందులో అతిథులందరూ తెల్లవారే వరకూ డాన్స్ చేస్తూ సంతోషంగా గడుపుతారు.

ప్రతి వసంతకాలంలో (మే 24-26, 2024, 23-25 మే 2025) మూడు రోజులపాటు జరిగే

ఈ పండుగకు 15మంది పార్టిసిపెంట్స్ వస్తుండగా, వారి ప్రోగ్రామ్‌లను చూసేందుకు 2 లక్షల మంది రావడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు.

ఓ ప్రాంతానికి చెందిన స్పెషల్ ఫుడ్‌ను తినడంతోపాటు, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద నత్తల విందు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీరంతా వస్తారు.

నత్తలను తినడంతోపాటు తాగడం, డ్యాన్స్ చేయడమే ఈ ఉత్సవంలోని ముఖ్యమైన విషయమంటారు అంటోనైటా సోలే అనే మహిళ.

ఆమె 34 ఏళ్ళ కిందట తన భర్తను ఆ ఫెస్టివల్‌లో కలుసుకున్నారు.

ఈ పండుగలో పాల్గొనే బృందాలు (వీరినే పెన్యాలు అంటారు) అన్నీ ఒకే విధమైన సమయాన్ని పాటిస్తాయి. అందరూ మధ్యాహ్నం 2.30 గంటలకు భోజనం, రాత్రి 10 గంటలకు డిన్నర్ చేస్తారు.

కొన్ని పెద్దపెద్ద బృందాలు ప్రొఫెషనల్ వంటవారిని నియమించుకుంటాయి.

మరికొన్ని బృందాలు తమలో తామే పనులను విభజించుకుంటాయని అరాంట్సా కాంట్రెరాస్ బ్లాజ్క్వెజ్ వివరించారు.

ఆమె 14 ఏళ్ళుగా పెన్యా లావాటివా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

ఈ ఉత్సవంలో ఆహారం ముఖ్యమైనప్పటికీ, స్నేహితులను తిరిగి కలవడం మరో మంచి విషయం అంటారామె.

‘‘ఇందులో సగం మందిని కేవలం ఏడాదిలో ఒకసారి ఇక్కడే మాత్రమే చూస్తాను’’ అని ఆమె చెప్పారు.

సంప్రదాయ రుచులు

మే నెల వేడివేడి వాతావరణంలో చల్లని బీరు తాగుతూ నత్తలను వండే పెద్ద పెద్ద బాణళ్ల చుట్టూ నుంచునే లైడా వాసుల సంతోషం అంతటా వ్యాపిస్తోంది.

పండుగ కోసం సిద్దం చేసిన వీధులన్నీ రద్దీగా ఉన్నాయి.

పార్క్ క్యాంప్ ఎలిసిసిలోని ఉత్సవ మైదానం మీదుగా నడుస్తున్నప్పుడు నత్త వేషధారణలో ఉన్న ఓ వ్యక్తిని, ఐఓలీ ( ఓ విధమైన సాస్) తయారీ పోటీని, పిల్లల నత్తల పోటీని చూశాను. నత్తలు చాలా భారంగా కదులుతాయి.

అందుకే చాలామంది కాటాలాన్ వాసులు నత్తలను వినోదంకంటే కూడా ఆహారంగానే బెస్ట్ అని అంటారు.

‘‘నత్తలు లైడా నగరపు కల్చర్. అదో ఆహారం. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి కూర్చుని షేర్ చేసుకుంటూ తినే ఫుడ్. మా జీవితాంతం నత్తలను వండుతూనే ఉంటాం, తింటూనే ఉంటాం’’ అని ఏడుపదుల వయసులోనూ చక్కగా ముస్తాబైన అంగ్లేస్ ఆన్స్ సోలే చెప్పారు.

ఆమె తన కుటుంబసభ్యులు వచ్చినప్పుడల్తా నత్తలతో కారకోలాడా తయారుచేస్తారు.

ఈ ఉత్సవానికి ప్రవేశ రుసుము లేదు. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఏ బృందంలో భాగం కాకపోయినా, విశాలమైన రెస్టారెంట్స్‌లలో మసాలా ఫుడ్స్ , పచ్చిమిరపకాయల సాస్‌లో వండిన అ-లా-గోర్మాండ లాంటి సంప్రదాయ నత్తలతో చేసిన ఫుడ్స్ తినొచ్చు. అక్కడ మంటపైన చతురస్రాకారంలోని వంటపాత్రలపై నత్తలను వండుతారు.

అప్లెక్‌లో తన పుట్టినరోజు జరుపుకోవడానికి నత్తలంటే ఇష్టపడే రోసా మరియా గుటిరెజ్ సమీపంలోని ఓ పట్టణం నుంచి వచ్చారు.

‘‘మాకు ఇష్టమైన అ-లా-గోర్మాండాను తిన్నాం. మీరు కూడా వాటిని ఆర్డర్ చేస్తే సాస్‌లో ముంచుకోవడానికి ఎక్స్‌ట్రా బ్రెడ్ అడగడం మరిచిపోకండి’’ అని చెప్పారామె.

ఈ సంప్రదాయ వంటకాలను పరిరక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు ఫెర్రాన్ పెర్‌డ్రిక్స్.

అప్లెక్ నిర్వాహక సంఘం ‘ఫెకోల్’కు అధ్యక్షుడు ఆయన. ‘‘నత్త ఓ ఖాళీ కాన్వాస్ లాంటిది. మీరు ఏ రుచిని జత చేరిస్తే అది దానిని సంగ్రహిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి తమదైన టేస్ట్ ఉంటుంది’’ అని అన్నారు.

గడిచిన మూడేళ్ళుగా ఫ్రాన్సిస్కో వివాస్ ఫెర్నాండెజ్, ఉత్సవ సమయాల్లో రెస్టారెంట్స్‌లో పని చేస్తున్నారు. అయితే తాను సేవలందించేవారిలో ఎక్కువ మంది స్థానికులే అయినా, ఫ్రాన్స్, జర్మనీ, మాల్టా నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ఉన్నారు.

15 వేల కేజీల నత్తలతో వంట

ఓ టేబుల్ వద్ద చైనా విద్యార్థుల బృందం కూర్చూని ఉంది. నత్తలతో చేసిన అ-లా-లౌనా వంటకాన్ని తినేందుకు మొదటిసారి ప్రయత్నిస్తున్నారు. వారికి దానిని ఎలా తినాలో అర్థం కావడం లేదు.

కానీ స్థానికులు మాత్రం పొడవైన టూత్‌పిక్‌లను ఉపయోగించి పెంకుభాగాన్ని తొలగించి నత్తను బయటకు తీసి తిని ఆ రుచికి లొట్టలేస్తున్నారు.

ఇటువంటి కుస్తీలు పట్టలేనివారి కోసం కాడ్ టమోటా సాస్, బూటిఫర్రా లాంటి సంప్రదాయ కాటాలన్ సాస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ ఉత్సవంలో కేవలం పెద్ద ఎత్తున ఆహారమే కాదు, కాటలాన్ సంస్కృతిపై ఓ క్రాష్ కోర్సును కూడా అందిస్తారు.

మనుషులు ఒకరిపై ఒకరు నిలబడుతూ పెద్దటవర్‌లా ఏర్పడటాన్ని, అలాగే సంప్రదాయ నృత్యమైన సర్దానాను చూసి సందర్శకులు ఉల్లాసభరితులవుతారు.

ఇటీవల సంవత్సరాలలో పెన్యాలలో భాగం కానివారికి వినోదాన్ని అందించే ఏర్పాట్లను మెరుగుపరుస్తున్నారు. ఈ వినోదంలో భాగంగా సంగీత కచేరీలు, ఓపెన్ ఎయిర్ డాన్సు ఫ్లోర్లను అందుబాటులోకి తెచ్చారు.

ఈ పండుగకు చాలామంది దగ్గరలోని నగరాల నుంచి వస్తారు. అలాగే హైస్పీడ్ రైల్ కనెక్షన్ ఉన్న మాడ్రిడ్ , ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారని పెడ్రిక్స్ వివరించారు.

నిజానికి అప్లెక్ జాతీయ పర్యటకుల ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలోనే అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతానికి ఈ ఏడాది ఈ నత్తల పండుగ ఓ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది 15 టన్నుల నత్తలను వినియోగించారు.

వారాంతంలో లైడా నగరం నత్తలనే ఊపిరిగా చేసుకుంటుంది. నత్తనే జీవితంగా మార్చుకుంటుంది.

ప్రతి ఒక్కరికి సర్వ్ చేసేందుకు నగరంలోని రెస్టారెంట్లు రెండుసార్లు వంట చేయాల్సి ఉంటుందని పెడ్రిక్స్ చెప్పారు.

ఈ ఉత్సవం ఏటికేడు విస్తరిస్తోంది. ఈ ఏడాది నాలుగు కొత్త బృందాలు చేరాయి. దీంతో 43 ఏళ్ళ ఈ పండుగ చరిత్రలో తాజా పండుగ అతిపెద్ద ఎడిషన్‌గా నిలిచింది.

అ-లా- గోర్మాండా వంటకం ఉన్న పెద్ద కుండ ముందు నుంచుని ఉన్న ఫ్రానెస్స్ సెగురాను గుర్తించాను. ఆయన 1980లో ఈ ఉత్సవ ప్రారంభానికి హాజరయ్యారు.

‘‘అప్పట్లో ఏడుగురం సిగ్రీ నది వద్ద ఏడాదికోసారి నత్తలను తినడానికి చేరేవాళ్లం.’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ అప్లెక్ పండుగ ఎంతో మారింది. కానీ తరచూ విస్మరణకు గురయ్యే కాటాలాన్ ప్రాంతపు విభిన్నమైన స్ఫూర్తిని కాపాడుతోంది. ఈ విభిన్నతను స్థానికులు ఫార్ వెస్ట్ అని అభివర్ణిస్తుంటారు.

కులీన సంస్కృతి, సందర్శకులను ఎక్కువగా ఆకట్టుకునే బార్సిలోనాకు భిన్నంగా తమ వద్ద అందమైన బీచ్ లు లేకపోయినా వారి వద్ద బోలెడు నత్తలు, బీరు, ఇతరులకు సమయం కేటాయించే నైపుణ్యం పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-06-11T05:35:30Z dg43tfdfdgfd