DONALD TRUMP | దాడి జరిగిన చోటే భారీ ర్యాలీకి సిద్ధమైన ట్రంప్‌.. కీలక ప్రకటన

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక నిర్ణయం ప్రకటించారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తన ట్రూట్‌ సోషల్‌ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ ర్యాలీ కోసం తాను బట్లర్‌ (Butler)కు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.

‘ఇటీవలే నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను. నేను మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయన్ని స్మరించుకుంటూ భారీ ర్యాలీ చేపట్టబోతున్నా. ఇందుకోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాను. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. వివరాల కోసం వేచి ఉండండి’ అని తన పోస్ట్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు.

జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్‌ ట్రంప్‌ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్‌ అటువైపు తిరగకుంటే బుల్లెట్‌ నేరుగా తలలోకి దూసుకెళ్లేది. ఇక ఈ కాల్పుల ఘటనలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరే ప్రాణాలు కోల్పోయారు.

Also Read..

Kamala Harris | అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన

Tihar Jail | తీహార్‌ జైలులో గొడవ.. ఇద్దరు ఖైదీలకు గాయాలు

NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ భేటీ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు

2024-07-27T06:34:59Z dg43tfdfdgfd