TG SCHOOLS REOPEN: తెలంగాణలో రేపటి నుంచి తెరుచుకోనున్న బడులు, ప్రభుత్వ బడుల్లో అసౌకర్యాలు, ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీ

TG Schools Reopen: తెలంగాణలో పాఠశాలలు బుధవారం జూన్ 12 నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు.

తెలంగాణలో పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జూన్ 12నుంచి తెలంగాణ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. మరోవైపు గత వారమే తెలంగాణ వ్యాప్తంగా బడి బాట కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జూన్ 19వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఈ ఏడాది నుంచి ఉదయం 9గంటలకే ప్రారంభించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది నుంచి ఉదయం 9గంటలకే తరగతుల్ని ప్రారంభించాలని భావిస్తోంది. ఉదయం 9.30కు తరగతులు ప్రారంభిస్తే పాఠశాల ముగిసే సరికి సాయంత్రం 4.45అవుతుందని దీంతో విద్యార్ధులకు కూడా ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై ప్రతిరోజు కనీసం 90శాతం మంది విద్యార్ధులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రతి నెలలో 4వ శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం అరగంట పాటు పాఠ్యపుస్తకాల పఠనం, కథల పుస్తకాలు పఠనం, దినపత్రికలు, మ్యాగ్‌జైన్లను చదివించాలని నిర్ణయించారు. టీశాట్ టీవీ పాఠాలను ప్రసారం చేయాలి. జనవరి 10వ తేదీ నాటికి విద్యాబోధన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ ఏడాది సెలవులు ఇవే...

2024-24 విద్యా సంవత్సరంలో సెలవులను కూడా ఖరారు చేశారు. 2024 అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13రోజుల పాటు సెలవులుగా నిర్ణయించారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. 2025 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తారు.

ఈ విద్యా సంవత్సరంలో 2025 జనవరి 10నాటికి పదో తరగతి విద్యార్ధులకు సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రివిజన్ క్లాసులు నిర్వహిస్తారు. 2025 ఫిబ్రవరి 28లోగా ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు సిలబస్ పూర్తి చేస్తారు. విద్యార్ధులకు ప్రతి రోజు యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తారు. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడేనా…

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలు తిష్టవేస్తే ప్రైవేట్ బడుల్లో ఫీజుల దోపిడీతో పాటు అసౌకర్యాలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో యూనిఫాం, పుస్తకాలను విక్రయించకూడదని ఉత్తర్వులు జారీ చేసినా ప్రతి స్కూల్లో యథేచ్ఛగా అమ్ముతూనే ఉన్నారు. అనుమతులు లేకపోయినా సెక్షన్లు పెంచుకుంటూ పోతున్నా విద్యాశాఖ తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.

వేలకు వేలు ఫీజుల రూపంలో దోచుకుంటున్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత మాత్రం వేధిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేక బాలికలు, టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా స్కూళ్లలో సిబ్బందికి వేసవి సెలవులు సైతం ఇవ్వకుండా అడ్మిషన్ల కోసం ఒత్తిడి చేశారు. కనీస వేతనాల మాట అటుంచితే నామమాత్రపు జీతాలతో సిబ్బందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లపై అజమాయిషీ అంతంత మాత్రంగా ఉండటంతో వాటికి ఆడింది ఆటగా మారింది.

2024-06-11T07:46:15Z dg43tfdfdgfd