AMARAVATI: ఏపీ రాజధాని అమరావతి.. వైజాగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు కూటమి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారన్నారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన తెలిపారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.  ఏపీ ఎన్నికల్లో  3 పార్టీలు నూటికి నూరు శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు చంద్రబాబు.  93 శాతం గెలుపు సాధించటం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం.. 57 శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలి అని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు వస్తే రాజధాని అమరావతి అవుతుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐదేళ్లు ప్రజలు తమ రాజధాని ఏంటో తెలియక తికమక పడ్డారు, కాసేపు విశాఖ అంటే.. కాసేపు విజయవాడ అని గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే, చంద్రబాబు రాగానే.. ఇప్పుడు రాజధాని ఏది అన్న విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ..  అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని  పిలుపునిచ్చారు. ప్రజా వేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలన్నారు.

విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోమన్నారు. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కర్నూలు అభివృద్ధికి  కట్టుబడి ఉన్నామన్నారు చంద్రబాబు. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండకూడదన్నారు చంద్రబాబు.  తన  కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు వెల్లడించారు.

2024-06-11T07:12:19Z dg43tfdfdgfd